Saturday, April 27, 2013

my article on annmayya song


పులికొండ సుబ్బాచారి

అన్నమయ్య పాట మాధ్యమం, నిర్మాణం
పాట అనే సంగీత సాహిత్య  ప్రక్రియ భాష సంస్థితి పొందుతున్న పొందిన అతి ప్రాచీన కాలంలోనే రూపొంది అతి పాతదైన మానవనిర్మిత కళారూపం, సాహిత్య రూపం. అప్పటికి సాహిత్యం లిఖితం మౌఖికం అనే వింగడింపు పొందలేదు. కారణం అప్పటికి ఉన్నది మనిషి నోటిద్వారానే సాహిత్యం మొత్తాన్ని సృష్టించుకునే విధం మాత్రమే. దానికి కొన్ని లేఖన చిహ్నాలను ఏర్పరచుకొని రాయడం నేర్చుకొని తన సాహిత్యానికి చూడడానికి వీలైన ఒక దృశ్యాత్మక స్థిరరూపాన్ని  ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే లిపి.  అందుకే లేఖనం లేదా రాయడం అనేది ఆతర్వాత చాలా కాలానికి జరిగిన సాంకేతిక విధానం సాహిత్యానికి ఒక సహాయం మాత్రమే. సాహిత్యం అన్నది అందునా పాట అన్నది ఒక మానవ అంతః సృజనం ఒక బౌద్ధిక, హార్దిక చర్య దానికి బాహ్య స్వరూపమే లిపి అంటే సాహిత్యానికి ఏర్పడిన లేఖన రూపం.  ఇక్కడే ఒక చారిత్రక సత్యాన్ని ప్రస్తావించాలి. మానవుడు బాగా బుద్ధిజీవుడై మాట్లాడ గలిగిన దశ ఏర్పడి 30,000 ముప్పై వేలనుండి 50,000 ఏభై వేల సంవత్సరాల నాడు అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. మనిషినే హోమోసాపియన్ అని అంటారు.  కాని మనిషి లిపిని సృష్టించుకొని దాన్ని సాహిత్య లేఖనానికి వినియోగించుకోవడం ప్రారంభించింది కేవలం 6,000 ఆరు వేల సంవత్సరాల క్రితమే అని కూడా వివిధ చారిత్రక అధ్యయనాలలో తెలిసింది.[1] అలా పాట లిపికన్నా చాలా ప్రాచీనమైనది.  అంటే మౌలికంగా నోటి సాహిత్యానికి చెందింది నోటినుండి నోటికి జారుతూ ప్రవహించే పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ.
 అన్నమయ్య జీవించి సాహిత్యాన్ని సృష్టించిన కాలం 1408 నుండి 1503 మధ్య అంటే దాదాపు పదిహేనో శతాబ్ది మొత్తం ఉన్నాడు.     కాలానికి సాహిత్యం లిఖిత రూపంలో కూడా బాగా స్థిరపడింది. పరివర్థితమైన ఛందస్సులు ఏర్పడడం వాటిలో ప్రౌఢమైన కావ్యాలు వెలయడం చాలా కాలం క్రితమే జరిగింది. అయినా అన్నమయ్య కాలానికి లిఖితంగా ఉండే సాహిత్యం తాళపత్రాలకు, శాసనాలకు రాగిరేకులకు పరిమితం అయింది. ఆధునిక కాలాన వచ్చిన కాగితం కాని సాహిత్యాన్ని సామాన్య మానవులు అందరికీ చేరేలా చేయగలిగే ఇతర సాంకేతిక మాధ్యమం కాని లేదు. సామాన్య మానవుల వరకు చేరగలిగే సాహిత్యం అప్పటికీ మౌఖిక సాహిత్య రూపం మాత్రమే అంటే అందరికీ చేరగలిగేది మౌఖికంగా ఉన్న పాట, ప్రదర్శనకు వీలయిన నాటకం, నోటినుండి నోటికి చేరగలిగిన కథ మాత్రమే. ఉన్నత విద్యావంతులైన కవులు పండితులకు అందుబాటులో ఉండే తాళపత్రాల పైన రాయడం లేదా రాగిరేకుల మీద రాయడం వాటిని వాడుకొని చదవడం  అనేది అప్పటికి బాగా ఉన్నత వర్గాలకు అతి చిన్న సంఖ్యలో ఉన్న విద్యావంతులైన శ్రేణికి మాత్రమే అందుబాటులో ఉండే సాంకేతిక సౌకర్యం. స్థితిలో అన్నమయ్య తను నమ్మిన దైవాన్ని గురించి వైష్ణవ మతాన్ని గురించి జనసామాన్యంలో జనబాహుళ్యంలో బాగా విస్తృతంగా ప్రచారం చేయడానికి తలపెట్టాడు. అందుకు బాగా వినియోగపడుతుంది అని ఆయన భావించిన మాధ్యమం పాట. పాటే జనానికి బాగా చేరగలిగిన మంచి మాధ్యమంగా మంచి ఆయుధంగా గ్రహించి అత్యంత ప్రతిభావంతంగా దాన్ని వాడుకొని తన భావాల్ని జనం దగ్గరికి చేర్చగలిగాడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
అన్నమయ్య పండిత కుటుంబంలో విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రితాతలు సంప్రదాయ సాహిత్యానికి లేఖన సాహిత్య సంప్రదాయానికి చెందిన వారే, వేద పండితులే. ఆనాటికి బాగా విస్తృతంగా ఆమోదించిన ప్రక్రియ కులీన వర్గంలో బాగా విస్తృతంగా ఉన్న ప్రక్రియ ఉన్నత వర్గానికి చెందిన ప్రక్రియ కావ్యం లేదా ప్రబంధం. ఇవి చంపూ సాహిత్య మార్గాలు. అంటే సంస్కృత ఛందస్సులతో నిండిన పూర్తిగా లిఖిత సాహిత్యానికి చెందే స్థిరపాఠ్యప్రక్రియ[2] అయిన కావ్యం  ఆనాడు ఉన్నత వర్గం మధ్య తిరుగాడే సాహిత్య ప్రక్రియ. సంస్కృతాంధ్రాలలో ఇతర దేశ భాషలలో బాగా నిష్ణాతుడైన అన్నమయ్య ఉన్నత వర్గానికి పరిమితం అయ్యే కావ్య ప్రబంధ ప్రక్రియలను కాని లిఖిత మాధ్యమానికి చెందిన నాటక ప్రక్రియను కాని గ్రహించకుండా పాటను ఎన్నుకొనడం, ఆయన సంస్కృతంలో కాని గ్రాంథికమైన క్లిష్టమైన ప్రౌఢమైన తెలుగు భాషలో ప్రబంధాలను కానీ రాయడం చేతగాక కాదు. తన లక్ష్యాన్ని చేరడానికి అవి పనికిరావని జనాన్ని చేరడానికి వినియోగపడవని గ్రహించడం వల్లనే. పాటే తన వైష్ణవ భక్తి ప్రచారానికి తగిన మాధ్యమం అని నిర్ణయించుకున్న తర్వాతనే పాటలోనే తన భావాలన్నింటిని రచించాడు. అంటే జనం మధ్య పాడుకున్నాడు. అందరూ పాడడానికి దోహదపడ్డాడు. తాళ్ళపాక చిన్నతిరుమలాచార్యుడు అంటే ఆయన మనుమడు అన్నమయ్య విగ్రహాన్ని తొలుతగా చేయించాడు.[3] విగ్రహాన్ని చూస్తే అందులో అన్నమయ్య చేతికి దండె మాత్రమే కాకుండా ఆయన కాళ్ళకు గజ్జెలు కూడా కనిపిస్తాయి. అంటే దీనితో తెలిసేదేమంటే దండెను మీటుతూ దానితో తన పాటకు శృతిని మేళవించుకొని పాటకు అనుగుణంగా నాట్యం చేస్తూ జనం మధ్య ఆటతో పాటను కలిపి ప్రదర్శించాడని తెలుస్తూ ఉంది.[4]
జనం మధ్యలో జన సాహిత్యంగా ఉన్న పాటను తన మాధ్యమంగా గ్రహించాడు అన్నమయ్య. దీని ద్వారా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని కూడా సృష్టించాడు. పాట కొత్త ఒరవడి కాదు. అంతే కాదు దేశి సాహిత్య ప్రక్రియలను వాడుకోవడం కూడా కొత్త ఒరవడి కాదు. కాని తన జీవితంలో మొత్తం సాగించిన సాహిత్య యాత్రలో పాటనే ప్రధాన సాహిత్య ప్రక్రియగా ఎన్నుకోవడమే అప్పటికి చాలా విశేషం.  జానపద సాహిత్యంలో లభించే కథలను వాడుకోవడం జనానికి బాగా దగ్గరికి వెళ్లగలిగే పాటకు బాగా దగ్గరిగా ఉండి పాడుకోవడానికి అనువుగా ఉండే ద్విపద ఛందాన్ని వాడుకోవడం అన్నది పదమూడో శతాబ్ది నాటికే పాలుకురికి సోమనాథుడు వంటి శివకవులు చేశారు. నిజానికి తాళ్ళపాక కవులు పెదతిరుమలాచార్యుడు, చినతిరుమలా చార్యులు తిరువెంగళనాథుడు, క్రమంలోని  అందరూ ద్విపద ఛందంలో రచనలు చేశారు. ఆనాటి వారే అయిన వెంగమాంబ వంటి ఇతర కవులుకూడా ద్విపద ఛందాన్ని వాహికగా చేసుకున్నారు. అయినా తాళ్ళపాక కవులు బాగా ఆధారపడిన సాహిత్య వాహిక, ప్రక్రియ పాటే. దీన్ని పదం అని వారు అన్నా, లేదా సంకీర్తన అని అన్నా అది మౌలికంగా, మౌఖికంగా వ్యాప్తిలోనికి వచ్చిన పాటే.
దృష్ట్యా చూచినప్పుడు జానపద సాహిత్యంగా ఉన్న అంటే మౌఖిక సాహిత్య రూపంలో ఉన్న పాటను తీసుకొని జానపద ప్రక్రియను వినియోగించుకొని వైష్ణవ మత సిద్ధాంతాన్ని, వేంకటాద్రీశుని పైని భక్తిని ప్రచారాన్ని చేయడానికి పూనుకున్నాడు అన్నమయ్య. ఇలా జానపద గేయాన్ని అంటే జానపద సాహిత్యాన్ని మరొక లక్ష్యం కోసం వాడుకొని తొలినాటి అనువర్తిత జానపద సాహిత్యాన్ని (Applied folk literature) ని సృష్టించిన వాడుగా అన్నమయ్య నిలబడుతున్నాడు. అన్నమయ్య పాటను తనదైన పద్ధతిలో రాయడమే కాదు అంటే పాడడమే కాదు. తన కాలానికి బాగా వ్యాప్తిలో  ఉన్న జానపద ఫణితులను అంటే పాటల వరుసలు చందమామా, జాజర, ఓలచ్చ గుమ్మడి వంటి వారాను వర్తానాలున్న ప్రత్యక్ష జానపద బాణీలను కూడా గ్రహించి పాటలు కట్టాడు. కాబట్టి తొలి నాటి అనువర్తిత జానపద గేయాలుగా అంటే అప్లైడ్ ఫోక్ సాంగ్స్ గా అన్నమయ్య పాటల్ని చెప్పాలి.[5] అంతే కాదు ఆయన తన పాట పాడుకోవడానికే అని భావించాడు. తను పాడిన పాటలు మరింత నమ్మకంగా వచ్చే తరాలకు చేరాలనే ఉద్దేశంతో పాటల్ని రాగి రేకుల మీద పాఠ్యాన్ని స్థిరంగా ఉంచాలనే ఆలోచన చేసి పని ప్రారంభించింది అన్నమయ్య అయినా, ఆయన పాటల్ని అన్నింటిని అంటే 32 వేల సంకీర్తనల్ని రాగిరేకులమీద చెక్కించింది ఆయన కుమారులు మనుమలు. సాళువ నరసింహరాయల వెన్నుదన్ను ద్వారా తర్వాతి ఏలికల ద్వారా వారు పని చేయించారు. అయినా అన్నమయ్య పాటలు తాళపత్ర రూపంలో ఉండి చదువుకోవడానికి అంటే పాఠకులకు ఉద్దేశించి సృష్టించినవి కావు. అవి పాడుకోవడానికి చేసిన నోటి సాహిత్య రూపాలు పాడుకునే పాటలే. అలా అన్నమయ్య మౌలికంగా నోటి సాహిత్య ప్రక్రియకు లేదా మౌఖిక సాహిత్య ప్రక్రియకు చెందిన కవి.   అన్నమయ్య సాహిత్య మాధ్యమం మౌఖిక సాహిత్య మాధ్యమం. ఒక లిఖిత సాహిత్య సంప్రదాయానికి చెందిన వాడు కులీన వర్గానికి చెందినవాడు పండితుడు అయి ఉండి మౌఖిక సాహిత్య మాధ్యమాన్ని ఎన్నుకుని జీవితాంతం పాడుతూ జీవితాన్ని పాటలా గడిపిన సాహిత్యకారుడు అన్నమయ్య. అతని పాట, సాహిత్య మాధ్యమం మౌఖిక సాహిత్య మాధ్యమం.
అన్నమయ్య ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానాన్ని పొందాడు. దీనికి కారణాలు ముఖ్యమైన వాటిని ఇక్కడ చెప్పాలి. ఆయన తన పదహారో ఏటనే పదాలు కట్టడం అంటే పాటలు కట్టి పాడడం మొదలు పెట్టానని స్పష్టంగా చెప్పాడు. దీనికి గట్టి చారిత్రక ఆధారాన్ని ఆయనే ఇచ్చాడు. రాగిరేకు మీద ఆయన స్వయంగా రాయించిన విషయం ఇక్కడ ఉంది. స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు 1346 (1424) అగు నేఁటి క్రోధి సంవత్సరమందు, తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించి పదహారు యేండ్లకు తిరువేంగళనాథుండు (వేంకటేశ్వరస్వామి) ప్రత్యకక్షమైతేను, అది మొదలుగాను శాలివాహన శకవరుషంబులు 1426  అగు నేటి దుందుభి సంవత్సర పాల్గుణ . 12 నిరుధానకు తిరువేంగళనాథుని మీదను అంకితముగాను తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన అధ్యాత్మ సంకీర్తనలు  అని రాగి రేకు ఆరంభంలో స్పష్టంగా ఉంది.[6] అన్నమాచార్యులు క్రీ.. మేనెల 9 తేదీ 1408లో పుట్టి ఫిబ్రవరి 23, 1503లో పరమపదం చెందినట్లు చెప్పడానికి తిరుగులేని చారిత్రక ఆధారాలున్నాయి. పైన చెప్పిన రాగిరేకే ఇందుకు బలమైన సాక్ష్యం. ఆయన 95 సంవత్సరాలు జీవించాడు. అంటే పదహారవ యేట సంకీర్తనలు అంటే పాటలు కట్టడం ప్రారంభించిన అన్నమయ్య మరణించిన దాకా అంటే దాదాపు ఎనభై సంవత్సరాల పాటు పాటలు నిర్విరామంగా రాసాడు. అంటే 29,200 రోజులు పాటలు రాసాడు. ఆయన 36 వేల సంకీర్తను రాసినట్లు కూడా తిరుగు లేని చారిత్రక ఆధారాలున్నాయి. కాని మనకి ఇప్పటికి దొరికినవి 12 వేలు మాత్రమే. అన్నమయ్య పాట ఒక దానిలో ఒక పల్లవి మూడు చరణాలు ఉంటాయి. పల్లవికి రెండు పంక్తులు చరణానికి నాలుగు పంక్తులు ఉంటాయి. అంటే మొత్తం 14 పంక్తులలో పాట పూర్తి అవుతుంది. కొన్ని పాటలు తక్కువ పంక్తులతో ఉన్నా మరికొన్ని ఎక్కువ గా ఉన్నా దాదాపు 95 శాతం పాటలు 14 పంక్తులతోనే ఉన్నాయి.
దీన్ని బట్టి అన్నమయ్య సృష్టించిన సంకీర్తనలు లేదా పాటలు 32 వేలలో మొత్తం 4,48,000 వేలు అక్షరాలా నాలుగు లక్షలా నలబై ఎనిమిది వేల పంక్తులు రచించాడు. ఒక కవి ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించడం మరెక్కడా జరిగినట్లు సమాచారం లేదు. ప్రపంచంలోనే మొదటిది క్రీ.పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినదిగా భావించడబడే ఇలియడ్ అనే హోమర్ కవి కృతిగా చెప్పే ఇతిహాసంలో ఉన్నది 15,693 పంక్తులు మాత్రమే. ఇక భారతీయ ప్రాచీన ఇతిహాసం మహాభారతం జయ అనే 25,000 శ్లోకాల స్థితినుండి అది మహాభారతం అనే లక్ష శ్లోకాల విస్తృతి చెందింది. అంటే రెండు లక్షల పంక్తుల పరిమాణంలో మాత్రమే ఉంది. సంప్రదాయికంగా మహాభారతం వ్యాసకృతం అనిచెప్పినా ఎందరో అజ్ఞాత వ్యక్తులు 25 వేలనుండి లక్ష శ్లోకాలకు పెరిగే క్రమంలో కవులుగా దానిలో భాగస్వామ్యం పంచుకున్నారు. భారత దేశంలో 2,00,000 పంక్తులు విస్తృతి ఉన్న సాహిత్యం మరొకటి లేదు. కాని అన్నమయ్య ఒకే వ్యక్తిగా ఉండి 4,48, 000 పంక్తుల సాహిత్యాన్ని సృష్టించాడు. అంతే కాదు ఇందులో కూడా కొన్ని పాటలే చాలా బాగుంటాయి మరికొన్ని పాటలు తాలుగా పోతాయి అని చెప్పడానికి వీలు లేదు. ప్రతి పాటా ఆణిముత్యం అనదగిన పాటే. మరొక ప్రత్యేకత ఏమంటే ఒకే వ్యక్తి ప్రపంచం మొత్తంలో ఇంత విస్తృతి  కలిగిన మౌఖిక సాహిత్యాన్ని సృష్టించిన వాడు కూడా మరొకరు లేరని ఇక్కడ గట్టిగా చెప్పవచ్చు. అన్నమయ్య సాహిత్యం మౌఖిక మాధ్యమ సాహిత్యం నేడు మౌఖిక మాధ్యమంలో లేదు. కాని ఆయన పాట రాయలేదు. పాడాడు. పాడడం కోసమే పాట కట్టాడు. దాన్ని లిఖిత మాధ్యమంలోనికి మార్చింది తర్వాతి పని అది అతను కాని అతని కొడుకులు మనుమళ్లు కాని చేసి ఉండవచ్చు. కాని అతనికి అవి పాటలే. మౌఖిక మాధ్యమ సాహిత్యం కర్తగా విస్తృతిలోగాని ప్రతిభాప్రకృతిలో గాని అన్నమయ్యకు సాటి మరొకరు నాస్తి నాస్తి నాస్తి అని చెప్పవలసి ఉంది. ఇది ఆయన సాహిత్య మాధ్యమం గురించి ఇక ఆయన పాట నిర్మాణాన్ని చూద్దాం.
పాట అన్నది ఒక బహుళ ప్రక్రియా రూపం అది సంగీతానికి సాహిత్యానికీ ఒకే సారి చెందుతుంది. అంటే సంగీతరచన సాహిత్య రచన ఒకే సారి సద్యఃస్ఫూర్తితో జరుగుతాయి. మౌఖిక మాధ్యమంలోనే సృజనం జరుగుతుంది. అంటే నోటి కళగా అది అప్పటికప్పుడు పుడుతుంది.  పాట పాడే లయకు రాగానికి అనుగుణంగానే పాటలోని మాటల కూర్పు అంటే సాహిత్య సృజనం అప్పటికప్పుడు జరుగుతుంది. అంతే కాదు పాడుతూ నాట్యం  చేసే వ్యక్తికి నాట్యంలోని లయకు కూడా అనుగుణంగా పాట సంగీతం ఉంటుంది. అంటే పాట అనేది మూడు కళల సమాహార కళ. ఒకటి సంగీతం, రెండు సాహిత్యం, మూడు నాట్యం. పాట సంస్థితి అన్ని సందర్భాలలో మూడింటిలో ఉండకపోయినా పాట అనేది సంగీతం సాహిత్యం అనే రెండు కళల సమాహారంగా ఎప్పుడూ ఉంటుంది. లిఖిత రూపంలో పుస్తకంలో అచ్చువేసిన పాటలో కూడా పాఠ్యంలో అంతర్గతంగా సంగీతానికి సంబంధించిన నిర్మాణం ఉంటుంది. పాట సృష్టించే వ్యక్తి జానపదుడు కాకుండా అప్పటికప్పుడు పాటను పాడుకునే వాడు కాకుండా ఉన్నా సరే చివరికి అతను సినిమా పాట రచయిత అయినా సరే దాన్ని పాడ బోయే సంగీత బాణీని తెలుసుకుని సంగీత దర్శకునితో కలిసి కూర్చొని పాటను దానికి అనుగుణంగా పదాల పాదాల కూర్పు చేసి రచించవలసి ఉంటుంది. కాలంనాటి వాగ్గేయ కారులుగా ఎంచ బడుతున్న అనువర్తిత జానపద గాయకులు (applied folk singers) గద్దర్, వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న మొదలైన వారు సృష్టించే పాట సృజనలో పద్ధతినే పాటిస్తున్నారు. పాట రచన అంటే సాహిత్య రచన సంగీత రచన కలిసే ఉంటాయి. పాట అన్నది మౌలికంగా మౌఖిక సాహిత్య ప్రక్రియ అది ప్రాథమికంగా పాడడానికి ఉద్దేశించింది. అన్నమయ్య చేసిన పాట రచన కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఆయన పాటలు కట్టింది తను నమ్మిన మత సిద్ధాంతాన్ని వైష్ణవ భక్తిని జనబాహుళ్యంలో ప్రచారం చేసి జనం నాలుకల మీద ఆడేలా చేయడానికే.  దాని నిర్మాణాన్ని కూడా అందుకు అనుకూలంగానే  చేసుకున్నాడు.
అన్నమయ్య పాటల్లో ఉన్న జానపదం గురించి జానపద సంగీత బాణీల గురించి చందమామా, జాజర వంటి వారానువర్తనాల గురించి ఇప్పటికే చాలా మంది పరిశోధన చేసారు. దాని జోలికి నేను వెళ్ళడం లేదు. అంతే కాదు అన్నమాచార్యుల కుమారుడు పెదతిరుమలాచార్యుడు ఆయన కుమారుడు అంటే అన్నమయ్య మనుమడు చినతిరుమలా చార్యులు అనే ఆయన సంకీర్తన లక్షణమ్ అనే లఘు కృతిని రచించాడు.[7] పదం అనే సాహిత్య ప్రక్రియకు ఉండే లక్షణాన్ని చెప్పాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. పాటను సంప్రదాయ కావ్యశాస్త్రాల మర్యాదను అనుసరించి పదం అని అంటూంటారు. అప్పటి భరతుని నాట్యశాస్త్రం దగ్గరనుండి నండూరి యెంకి పాటల వరకు పాటకు పదం అనే మాటను పర్యాయపదంగా వాడారు. పదం పాడిందంటే పాపాలు పోవాలి అనియెంకిని గురించి చెబుతాడు. 71 కందపద్యాలలో రాసిన సంకీర్తన లక్షణంలో కొన్ని పద్యాలలో ఎన్ని రకాల పదాలుంటాయి వాటి నిర్మాణం ఎలా ఉంటుంది. యతి ప్రాస నియమాలు ఎలా ఉంటాయి. అనే విషయాలను రాసాడు చిన తిరుమలయ్య.
పదం అనే దానికి ప్రాథమికంగా ఎన్నిలక్షణాలు ఉంటాయో చెప్పడానికి ముందు పదం లక్షణాలను అంతకు ముందే ఎక్కడెక్కడ ప్రాచీనులు చెప్పారో చెప్పాడు ఒక సీస పద్యంలో.[8] సంగీత రత్నాకర ప్రబంధం లో, సంగీత చంద్రిక లో, సంగీత చూడామణి, సంగీత సుధాకరం అనే గ్రంథాలలోను వాటికి మూలమైన భరతంలోను పదలక్షణాలు చెప్పబడ్డాయని ఆధారాలు ఇచ్చాడు. తిరుమలాచార్యుడు. పదము అనే ప్రక్రియకు వృత్తము, చూర్ణము, నిబంధకము అనే పేర్లున్నాయని చెప్పాడు. వృత్తము అనేది సమవృత్తము అని విషమ వృత్తము అని రెండు రకాలు గా ఉంటుందని సమ వృత్తంలో నాలుగు పాదాలుంటాయని సరిపాదాలు లేకుంటే దాన్ని అర్థసమవృత్తం విషమ వృత్తంలో పాదాలు మరింత వేరే గా ఉంటాయని దీన్ని అన్నయార్యుడు అన్నాడని చెప్పాడు.  
నిబంధన అనే పేరున్న పదములో యతులు ప్రాసలుంటాయి మాత్రలు తాళసంగతులుంటాయి అని అన్నాడు. వీటిలో నాలుగు పాదాలలో యుతులుంటాయి అని రెండో అక్షరంలో ప్రాస ఉంటుందని లక్షణంగా చెప్పాడు. నిబంధన అనే పదము నకు అవాతంరంగా అవయవాలుగా ఇతర పద్ధతులలోను నిబంధనలుంటాయి అన్నాడు. ఇంకా వివిధ రకాలైన పదములను గురించి వాటి పేర్లను గురించి సంకీర్తన లక్షణంలో ఉంది. అంతే కాదు గ్రామ్యోక్తులను వాటి
ఒడుపు తెలిసి ప్రాముఖ్యాన్ని తెలిసి నైపుణ్యంతో పలకాలి అంటే రచించాలి అని చెప్పాడు. పదము అనే ప్రక్రియ గ్రామ్య భాషలో అంటే ప్రజలు మాట్లాడుకునే భాషలోనే చెప్పి ఒప్పించాలి అని చెప్పాడు.
ఇలా సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని శాస్త్రాన్ని బట్టి తెలిసేది పాట నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే. కాని అన్నమయ్య తన కాలంనాటివికాని తనకు పూర్వం ఉన్న కాలం నాటివికాని అలంకార గ్రంథాలలో ఉన్న పదము అనే ప్రక్రియకున్న లక్షణాల గురించి తెలుసుకున్నా ప్రత్యక్షంగా తాను పాటలు కట్టేటప్పుడు వాటిని గురించి అంతగా పట్టించుకోలేదు. అన్నమయ్య పాటలు సంకీర్తన లక్షణంలో చెప్పిన వింగడింపుకు ఒక్కొక్కటి చెందుతుందో లెక్కకట్టి నిరూపించడం చాలా కష్టం. దుస్సాధ్యం. కాని పాటలో ఒక ప్రాస నియతి యతి నియతి పెట్టుకుని రాసారు అని నియమాలు శాస్త్రాలలో కూడా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. అన్నమయ్య పాటల్ని సంకీర్తన లక్షణ గ్రంథంలో చెప్పిన పేర్ల ప్రకారం లక్షణాల ప్రకారం ఉదాహరణలుగా చూపి అధ్యయనం చేయడం అనేది పెద్ద ప్రయోజనం ఉన్న విషయం కూడా కాదు. కారణం అన్నమయ్య పాట ఒక్కటీ సమాన నిర్మాణంతో లేదు. కాగా అన్నమయ్య తాను పదం కీర్తన అనే పేర్లను ఎలా వినియోగించినా పాటే తన ప్రక్రియ అని భావించినట్లు చెప్పడానికి ఉపయోగపడే ఉదాహరణలు ఆయన పాటల్లోనే దొరుకుతాయి. కీర్తన అనే మాట మామూలు నిత్యవ్యవహార భాషలో పాట అనే అర్థంలోనే జన సామాన్యంలో ఉంది. కీర్తించడం అనే మాట కూడా భక్తికి సంబంధించిన పదంగానే వినియోగంలో ఉంది. బుర్ర రాం కీర్తన పాడుతుంది రోయ్ జాగ్రత్త. అనే తెలుగు పలుకుబడి ఇక్కడ కీర్తన అంటే పాట అనే అర్థం. సంగీతంలోను కీర్తన అనే మాట కృతి అనే మాట కూడా పాట పరంగానే వాడుతున్నారు.
అన్నమయ్య పాటల్లో వస్తు పరంగా ఉన్న వైవిధ్యాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించి చర్చించడం సాధ్యం కాదు. కాని వస్తువుకు రాగానికి దగ్గరి సంబంధం ఉంది. అలాగే పాటలోని రూపానికి సంబంధం ఉంది. వీటిని పూర్తిగా విడిగా చూడడం కుదరదు. అన్నమయ్య తన పాటలన్నింటికి రాగాలను తనే నిర్దేశించాడు. తాను కూడా అదే రాగంలో పాడి అలా పాడడంలో పాటకు బాగా వ్యాప్తి వచ్చిన తర్వాతనే పాట ఆరాగం అనే సంబంధం కలిసింది. రాగిరేకులలో ప్రతి పాట దగ్గర, రాగం పేరు ఉంది. అన్నమయ్య రాగం చెప్పాడు కాని తన పాటలకు తాళం చెప్పలేదు. దీనివల్ల తర్వాతి కాలపు గాయకులు అన్నమయ్య పాటల్ని వారికి అనుకూలమైన తాళంలో పాడుకునే వైవిధ్యం లభించింది. పాటలు పాడే తీరు పరివర్థితమై అన్నమయ్య పదాలు నేడు కర్ణాటక సంగీతంలో శాస్త్రీయ సంగీతం శైలిలోనికి వచ్చాయి. కాని అన్నమయ్య పాడిన పద్ధతి ఇదేనా అని చెప్పడం ఈనాడు దీని వల్ల సాధ్యం కాకుండా పోయింది. అన్నమయ్య పాటల్ని బాగా ప్రసిద్ధంగా పాడే వారు పాడిన పద్ధతిని గ్రహించినా కూడా అన్నమయ్య ఇలా పాడి ఉండేవాడు అనే చెప్పే వీలు లేదు. కొన్ని చందమామా అనే వారానువర్తనం ఉన్న పాట తుమ్మెదా అనే వారానువర్తనం ఉన్న పాట ఇంకా ఇలాంటి జానపదగీతాల వరుసల్లో ఉన్న పాటల్ని అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్న వరుసలు కాబట్టి ఇలా పాడి ఉంటాడు అని చెప్పడానికి వీలవుతుంది.
అన్నమయ్య వస్తువుతో రాసిన పాటకైన ఒక సుష్ఠు నిర్మితిని పెట్టుకున్నాడు. పాటకు ఒక పల్లవి ఉంటుంది. ఇది రెండు పంక్తుల్లో ఉంటుంది. రెండు పంక్తుల్లోను యతి మైత్రి పాదానికి పాదానికి ఉంటుంది. పాదంలోని మొదటి అక్షరానికి పాదంలోని మధ్యలోని ఒక అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది. సాధారణంగా పదాదిని అక్షరంతోనే మైత్రి కుదురుతుంది. కాని యతి మైత్రి వృత్త పద్యాల ఉన్న రీతిలో ఫలానా సంఖ్యలోని అక్షరానికి (10, 11, 12) అని  కాని జాత్యుపజాతి పద్యాల లో ఉన్న రీతిలో ఫలానా గణంలోని మొదటి అక్షరానికి అని కాని ఒక నియమం ఏదీ ఉండదు. మొత్తానికి ఒక యతి మైత్రి తప్పని సరిగా ఉంటుంది. ఇక పల్లవి లోని రెండో పాదంలోను ఇదే తీరున యతి మైత్రి ఉంటుంది. పల్లవి లోని రెండు పాదాలకు ప్రాస నియమం ఉంటుంది. కింద ఒక ఉదాహరణ చూద్దాం.
అదివో అల్లదివో శ్రీ హరివాసమూ
పదివేలు శేషుల పడగల మయమూ 

ఇక్కడ ఉన్న రెండు పాదాలలో మొదటి పాదంలోని యతి మైత్రి తొమ్మిదో అక్షరానికి ఉండగా రెండో పాదంలో ఎనిమిదో అక్షరానికే ఉంది. ప్రాస కారంతో కుదిరింది. మరొక ఉదాహరణ.
నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విదులు వైష్ణవులు
త్యము వీరల రణని బ్రదుకరొ సాటికి బెనగక జడులాల

రెండు పాదాలలోను యతి మైత్రి రెండు చోట్ల ఉంది. కాని నిత్యులో 'ని', నిగమాంత లో ఉన్న 'ని' యతి స్థానంలో ఉండటం వల్ల  రెండో పాదంలో సత్యములో '' సాటికి లోని 'సా' కు యతి మైత్రి కుదరడం వల్ల పల్లవి పాడడంలో లయ కుదురుతుంది. ఇందులోని ప్రాస సంయుక్త తకారం.
ఇలా ఏర్పడిన తర్వాత వరుసగా మూడు చరణాలు ఉంటాయి. ఒక్కో చరణంలో సరిగ్గా నాలుగు పంక్తులు ఉంటాయి. పైన పల్లవిలో చెప్పిన యతి ప్రాసనియమాలు చరణాలలోను ఉంటాయి. కాకుంటే పల్లవిలో రెండు పాదాలుండగా చరణంలో నాలుగు పాదాలుంటాయి. ఇక చివరి చరణంలో ముద్ర ఉంటుంది. అది వేంకటేశ్వరుని కున్న వివిధ నామాలలో ఏదైనా ఒకటి ముద్రగా మూడో పాదంలో కాని నాలుగో పాదంలో కాని ఉంటుంది లేదా ఇందులోని పాదంలోనైనా ఉండవచ్చు. నియమం లేదు. ఇది అన్నమయ్య కీర్తన అని గుర్తు పట్టడం ముద్ర వల్లనే సాధ్యం అవుతుంది. ఒకరు సృష్టించిన పదాలను మరొకరు అంది పుచ్చుకొని పాడే అలవాటు ఆనాడే ఉందని ఒక విషయం ద్వారా తెలుస్తుంది. తాళ్ళపాక చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణం లో ఇలా పాటల్ని చౌర్యం చేసే వారిని దూషిస్తూ ఒక పద్యం రాస్తాడు. పరిస్థితిని గమనించే వేంకటేశ్వర స్వామి ముద్రను వేసాడు అన్నమయ్య. కాని ముద్రలో తన పేరును కాకుండా స్వామి పేరునుంచడం లోని అంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ చౌర్యం నిరోధించడంగా మాత్రమే దీన్ని అర్థం చేసుకోకూడదు. అన్నమయ్య రాసిందే అయినా ప్రజల్లోనికి వెళ్ళి అందరు పాడే స్థితిలో ఎవరైనా ఇది నా పాటే అని చెప్పుకునే వారు రావచ్చు. అప్పుడు పాట అసలు కట్టిన వానికి కీర్తి రాకుండా మధ్యలో వానికి రావచ్చు. దృష్టితోనే ఆనాటి వాగ్గేయ కారులు శతక కవులు తమ ముద్రలను ఏదో ఒక రూపంలో వేసుకున్నారు.  కింద ఒక చరణాన్ని చూద్దాం.
లజాక్షి మోమునకు క్కవ కుచంబులకు
నెలకున్న కప్పురపు నీరాజనం
లివేణి కురువునకు స్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం                     - క్షీరాబ్ది-

ఇదే పాటలో చివరి చరణం కింద ఉంది

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం                          -క్షీరాబ్ది-

ఇలాంటి చరణాలు మూడు సర్వసాధారణంగా అన్ని పాటల్లోను ఉన్నాయి. కాని చాలా అరుదుగా కొన్ని పాటల్లో ఆరుచరణాలున్నాయి. బ్రహ్మమొక్కటే పాటలో ఆరు, జో అచ్యుతానంద జోజోముకుందా పాటలో అరుదుగా తొమ్మిది చరణాలున్నాయి. నానాటి బ్రదుకు నాటకము లో రెండే చరణాలున్నాయి.  ఇంకా చాలా వైరుద్ధ్యాలున్నాయి. కొన్ని పాటలు కేవలం ఆరు పంక్తులతో ఉన్నాయి. ఇలాంటి విశేషమైన పాటలు కొన్నే కనిపిస్తాయి. కాని అత్యధికంగా కనీసం తొంభై శాతం పాటలు ఒక పల్లవి మూడు చరణాలతో నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. పల్లవిలో రెండు పాదాలు చరణంలో నాలుగు పాదాలు యతిమైత్రి  ప్రాసనియమం అనే నియమాలు అన్ని పాటల్లో ఉన్నాయి. ఇలా పాటలన్నీ ఒక ఏకరూప నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.
కాని పాటల నిర్మాణం ఒక అమరికలో ఏక రూప నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కాని పాటకు పాటకు నిర్మాణం మారుతుంది. కారణం  పల్లవి పాదాలలో కాని చరణాలలోని పాదాలలో కాని గణ నియమం అనేది లేదు. అంతే కాదు పాదం పొడవులో నియమం ఏదీ లేదు.  పాదాలు ఎంత పొడవైనా ఉండవచ్చు. అంతే కాదు ఒకే చరణంలోఉన్న నాలుగు పాదాలు కూడా నాలుగు పొడవుల్లో ఉండవచ్చు. అన్నమయ్య పాటల్లో అతి తక్కువలో ఎనిమిది అక్షరాలున్న పాదాలున్నాయి అతి దీర్ఘంగా 26 అక్షరాల దాకా ఉన్న పాదాలున్నాయి. పాట కట్టడంలో ఇంత స్వేచ్ఛ ఉండడం వల్లనే పాటలు మౌఖిక మాధ్యమంలో ప్రజల్లో అతి సులభంగా చాలా బాగా వ్యాప్తిలోనికి రాగలిగాయి. జానపద గేయాలకుండే ప్రధాన లక్షణమే ఇది పాద నియమం కాని గణ నియమం కాని ఏదీ ఉండదు. జానపద గేయాలు ఏదీ తీసుకున్నా పల్లవిలోను చరణాలలోను అనుకోకుండా మీకు యతినియమం కనిపిస్తుంది. గద్దర్ పాటల్లో కూడా  నియమం అనుకోకుండానే కనిపిస్తుంది. ఇది పాటలో సంగీత మాధుర్యం రావడానికి తోడ్పడుతుంది. అంతే కాదు జానపద గేయం చరణాలలో ఏదో ఒక విధంగా ఆది ప్రాస కాని అంత్య ప్రాస కాని సమతూకంలోని పాదాలు కాని ఉండి పాటకు లయను తియ్యదనాన్ని తెస్తాయి. పాటని వచనం నుండి వేరు చేసే గుణమే ఇది. విధమైన సమానాక్షర సమ్మేళనం వల్ల స్వేచ్ఛలో కూడా ఉన్న నియతి వల్ల పాటలకు సంగీత గుణం, తియ్యదనం చేరతాయి. అవి వివిధ రాగాలకు ఒదగడానికి సాధ్యం అవుతుంది. అన్నమయ్య పాటలోని నిర్మాణాన్ని కింది విధంగా ఒక డయాగ్రంలో చూడవచ్చు.

అన్నమయ్య పాటకు చిత్ర రూపం ఇది. ఇందులోని అడ్డు గీతలు పల్లవి చరణాలలోని పంక్తులు, మొదటి నిలువు గీత అన్ని పంక్తులలోని తొలి అక్షరం. రెండవ నిలువు గీత  ప్రాస స్థానం అన్ని పంక్తులలో అంటే పాదాలలో ఒకే చోట ఉండడాన్ని సూచిస్తుంది. మూడో నిలువు గీత యతి మైత్రి అక్షరాన్ని తెలుపుతుంది. కాని దాని పక్కన ఉన్న గుండ్రటి గుర్తులు యతిస్థానం వేరు వేరు చోట్ల ఉండడాన్ని తెలుపుతుంది. మొదటి అక్షరం మాత్రం ఒకే తొలిస్థానంలో ఉండడాన్ని కూడా చూడవచ్చు. పల్లవి ఎన్ని చోట్ల పునరావృతమౌతూ ఉందో చూడవచ్చు. పాట నిర్మాణం ఎంత పకడ్బందీగా ఉన్నా స్వేచ్ఛకూడా ఉండడాన్ని గమనించవచ్చు.
పల్లవి
చరణం1
చరణం2
చరణం3
పల్లవి
పల్లవి
పల్లవి
పల్లవి
ప్రాస
యతి మైత్రి
యతి మైత్రి అక్షరాలు
అఅ
 











పై నున్న పాట నిర్మాణాన్ని సాహిత్య రూపంలో కింద పూర్తిగా చూడవచ్చు.

అప్పులేని సంసార మైన పాటే చాలు
తప్పులేని జీత మొక్క తారమైన చాలు                      -అప్పులేని-

కంత లేని గుడిసె గంపంతైనా చాలు
చింత లేని అంబ లొక్క చేరెడే చాలు
జంత గాని తరుణి జాతైన నదే చాలు
వింత లేని సంపదొక్క వీసమే చాలు                  -అప్పులేని-

తిట్టు లేని బతుకు ఒక దినమైన నదే చాలు
ముట్టు లేని  కూడొక్క ముద్దెడే చాలు
గుట్టు చెడి మనుకంటె కొంచెపు మేలైన చాలు
వట్టి జాలి పడు కంటె వచ్చినంతె చాలు         -అప్పులేని-

లంపట పడని మేను లవలేశమె చాలు
రొంపి కంబమౌ కంటె రోయుటె జాలు
రంపపు కోరిక కంటె రతి వేంకట పతి
పంపున నాతని జేరె భవమే చాలు                   -అప్పులేని-


అన్నమయ్య పాట అంతర్గత నిర్మాణాన్ని పైన చిత్ర రూపంలోను సాహిత్యంలోను చూచాము.
పాట నిర్మాణాన్ని పాడే క్రమంలో వింటూండగా మరొక రకమైన నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఇది శ్రేణీకృతమైన నిర్మాణం. పాడేటప్పుడు చరణంలోని ఒక పాదం తర్వాత మరొక పాదం పాడుకుంటూ పోతాడు గాయకుడు. పైన చిత్రంలో పాదాలు ఒక దానికింది మరొకటి ఉండడం చూచాము. కాని పాడే క్రమంలో పాదాలను ఒక దాని తర్వాత ఒక దాన్ని ఒక శ్రేణిలో రాస్తే వరసలోని పాదాలలో అక్షరాలు ఏవేవి ఎక్కడెక్కడ పునరావృత్తి చెందుతాయో మనం మరొక రీతిలో గమనించవచ్చు. అక్షరాలు నిర్ణీత క్రమంలోను స్వేచ్ఛగానూ పునరావృతమై పాటకు నిర్మితిని కల్పిస్తాయి. పాటను శ్రవణపేయం చేస్తాయి.  యతి మైత్రి కలిగించే అక్షరాలు అలాగే పాదాల ప్రాస స్థానాక్షరాలు కూడా పునరావృతమై ఇదీ ఒక క్రమంలో జరగడం వల్ల చరణంలో ఒక సుష్ఠు నిర్మితి ఏర్పడి పాటకు మాధుర్యాన్ని పునరావృతులే కలిగిస్తాయి. అయితే పునరావృతుల్ని సంప్రదాయకమైన వృత్యను ప్రాసాలంకారంగా చెప్పడం పాట నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసినట్లు అవుతుంది. కవి ఉద్దేశానికి అపచారం  చేసినట్లు కూడా అవుతుంది.

దీన్ని కింద చిత్ర రూపంలో చూడవచ్చు.
పాదం 1
పాదం 2
పాదం 3
యతిమైత్రి పాదంలో
 పై
ప్రాస సంబంధం పాదాల మధ్య
 







Structure of a Song:  syllable repetition at equal intervals in linear order.
పాట నిర్మాణం:  శ్రేణీక్రమ సమానాంతర అక్షరావృత్తి

మౌఖిక మాధ్యమంలో స్వేచ్ఛగా రచించే పాటలో అప్పటికప్పుడే సంగీత సాహిత్యాలు సృజన జరిగే పాటలో అంతర్గతంగా ఇంత నిర్మాణం ఉంటుంది. నియమాలు ఏమీ లేవు అనే స్థితిలో కూడా నిర్మాణం ఉంటుంది. అన్నమయ్య తాను సృష్టించిన పాటల్లో ముప్పావు మువ్వీసం పాటలు ఇదే రీతిలో సృష్టించాడు.  చాలా జానపద గేయాలలో వాటిదైన నిర్మితి వాటికి ఉంటుంది. దీనిలో చరణాలలోని పాదాల సంఖ్య కాని చరణాలలో సమాక్షర యతిస్థానం నిర్ణయించడం గాని కవి అప్పటికప్పుడు చేసుకుంటాడు. ప్రాస స్థానాన్ని పాటించక పోయినా అంత్య ప్రాసను పాటించవచ్చు. లేదా సమతూకంలో ఉండే పదాలు చివరలో కాని మొదటలో కాని వేసుకోవచ్చు. ఏదైనా పాటకు అప్పటికప్పుడే దాని నిర్మాణం ఏర్పడుతుంది. ఎన్ని జానపద గేయాలు చూచినా రీతి కనిపిస్తుంది. పల్లవి మూడు చరణాలుండే పాటలే సర్వసాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి. పాట సాహిత్యంలో మాత్రం నిర్మాణం లేకుండా కేవలం వచనంలా కనిపించే వచనాన్ని సైతం సంగీతజ్ఞులైన గాయకులు తియ్యగా పాడ వచ్చు. కాని అంత మాత్రాన అది మంచి పాట కావాలని ఏమీలేదు. పాట అనే ప్రక్రియ సాహిత్య ప్రక్రియగా తనదైన నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడే సంగీతానికి బాగా తోడ్పడుతుంది. తియ్యటి పాట సృష్టి జరుగుతుంది. అన్నమయ్య పాటకాడుగా విజయం సాధించింది ఇక్కడే. పాటకాడు అనే మాటను వాగ్గేయకారుడు అనే మాటకు సరిగ్గా సమానార్థక పదంగా వాడుతున్నాను. మనవాళ్లు తెలుగు సమాసాన్ని వాడడానికి ఎందుకో ఇష్టపడరు గాని. పాటకాడు అనే మాట రాసే వానికి పాడే వానికి రెండింటికి సమానంగా వర్తిస్తుంది. కాబట్టి అన్నమయ్య మంచి పాటకాడు.
Select Bibliography:
అన్నమాచార్యులు తాళ్ళపాక. 1980. అధ్యాత్మ సంకీర్తనలు. సంపుటాలు. తిరుపతి. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు.
చిన్న తిరుమలా చార్యులు తాళ్ళపాక. 1835. సంకీర్తన లక్షణమ్. విజయ రాఘవాచార్య వి. సంపా. 1935. మైనర్ వర్క్స్ ఆఫ్ అన్నమాచార్య అండ్ హిస్ సన్స్. మద్రాసు. మహంతాస్ దేవస్థానమ్స్ ప్రెస్. లోనిది.
Ambika Ananth and Adviteeya. N. Dixit. (tr.) 2005. Nector Ocean of Annmacharya (Translations of Annamayyas songs). Tirupathi. T.T. D press.
Charlee T. MacCormick and Kim Kennady White. Ed. 2011. Folklore: An Encyclopedia of  Beliefs, Customs, Tales, Music and Art. California. ABC- Clio.
Ong, J. Walter. 1982. Orality and Literacy: Technologizing of the Word. Metheun & Co. ltd.
Vijayaraghavacharya, V. ed. 1935. The Minor Works of Annmacharya and His Sons. Madras. Sri Mahanthas Devasthanams Press.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
జానపద విజ్ఞాన గిరిజన అధ్యయన శాఖ
ద్రావిడ విశ్వవిద్యాలయం
కుప్పం 517246



[1] Ong, J. Walter. 1982 p. 2.
[2] లిఖిత సాహిత్యం (fixed text) స్థిరపాఠ్యంతో ఉంటుంది. అదే మౌఖిక సాహిత్యం లేదా జానపద సాహిత్యంలోని పాఠ్యం అస్థిరమైనది మనిషి మనిషికి ఇది మారుతుంటుంది. అన్నమయ్య పాడడానికి ఉద్దేశించుకున్న పాట ఇలా మనుషుల మధ్యలోనికి చేరి మారిపోయేదే.
[3] Ambika Ananth and Adviteeya. N. Dixit. 2005. P. 144
[4] దండె అనే ఈ సంగీత వాద్యం కడప జిల్లాలో ఇప్పుడు కనిపించడం లేదు. కాని ఈవ్యాసకర్త ఇటీవల వికారాబాద్ జిల్లాలో క్షేత్రపరిశోధన పర్యటన చేసినప్పుడు అనంతగిరి కొండ మీద పద్మనాభ స్వామి ఆలయం దగ్గర్లో విష్ణుభక్తుడైన మాలదాసరి దండె తీసుకొని పాడుతూ కనిపించాడు. ఇది పాట పాడేటప్పుడు శృతి చేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుంది.
[5] Applied folklore is the branch of folkloristics concerned with the study and use of folklore and traditional cultural materials to address or solve real social problems. -- http://en.wikipedia.org/wiki/Applied_folklore.                                     In the early years of the concept of Applied Folklore it was called as Folklorisums and Folklorism. These Ideas were conceptualized by Regina Bendix. She Defined Applied folklore as “Folklore outside of it context   or spurious folklore… The term Folklorisums has been applied to visually and aurally striking or aesthetically pleasing materials such as festive performance, music, art (but also foods) that lend themselves to being extracted from their initial contexts and put to new use for different often for larger audiences” p. 537  Bendix, Regina 1988. Folklorism: The Change of Concept. International Folklore Review 6: 5-15. In Charlee T. MacCormick and Kim Kennady White. Ed. 2011. Folklore: An Encyclopedia of  Beliefs, Customs, Tales, Music and Art. California. ABC- Clio
[6] అన్నమాచార్యులు తాళ్ళపాక. 1980. అధ్యాత్మ సంకీర్తనలు. తిరుపతి. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు. పుట. 59.
[7] Vijayaraghavacharya, V. ed. 1935. The Minor Works of Annmacharya and His Sons. Madras. Sri Mahanthas Devasthanams Press. Pp. 137-150

[8] Ibid p. 140

No comments: